టీడీపీ, జనసేన పార్టీలను తుక్కు తుక్కుగా ఓడిస్తామన్న అంబటి
టీడీపీ, జనసేన పార్టీలను తుక్కు తుక్కుగా ఓడిస్తామన్న అంబటి
ఏపీ మంత్రి అంబటి రాంబాబు విపక్ష నేతలపై ధ్వజమెత్తారు. టీడీపీ, జనసేన పార్టీలను తాము తుక్కు కింద ఓడిస్తామని అన్నారు. చంద్రబాబుకు సింగిల్ గా పోటీ చేసే సత్తా లేదని ఎద్దేవా చేశారు.
మేం ఇన్చార్జిలను మార్చడం గురించి అడుగుతున్నారు సరే... చంద్రబాబు ఎక్కడ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు? చంద్రగిరిలో ఓడిపోయిన చంద్రబాబు కుప్పం ఎందుకు పారిపోయారు? సొంత జిల్లా చిత్తూరులో కాకుండా లోకేశ్ ను మంగళగిరి ఎందుకు తీసుకువచ్చారు? బాలకృష్ణ స్వస్థలం వదిలి హిందూపురంలో ఎందుకు పోటీ చేశారు? పురందేశ్వరి ఎందుకు సీట్లు మార్చుతున్నారు? అంటూ అంబటి ప్రశ్నల వర్షం కురిపించారు.
గతంలో కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన ఎందుకు విడిపోయాయో చెప్పాలని, ఇప్పుడు చంద్రబాబు మళ్లీ పవన్ కల్యాణ్ ను వెంటేసుకుని రావడానికి కారణమేంటో చెప్పాలని నిలదీశారు. ఇంతకీ పవన్ కల్యాణ్ కు ఎన్ని స్థానాలు ముష్టి వేస్తున్నారు? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని అంబటి వివరించారు.
లావు తగ్గడం కోసమే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారన్న వేణు
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు విమర్శలు గుప్పించారు. లావు తగ్గడం కోసమే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అది పాదయాత్ర కాదు.. క్యాట్ వాక్ అని వ్యాఖ్యానించారు. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని అన్నారు. పాదయాత్ర వల్ల ఎలాంటి ఉపయోగం లేదని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గతంలోనే చెప్పారని... అయినా లోకేశ్ పట్టించుకోలేదని చెప్పారు. ఒక ఎర్ర బుక్కు రాస్తున్నానని లోకేశ్ పదేపదే చెపుతున్నారని... పాదయాత్రకే విలువ లేనప్పుడు ఎర్ర బుక్కు రాసుకుని ఏం చేస్తారని ప్రశ్నించారు. సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలకు పోజులివ్వడం తప్ప... పాదయాత్రకు పెద్ద విలువ లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైసీపీనే అని చెప్పారు.