ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలో గాలిస్తున్న ఎన్ఐఏ

ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలో గాలిస్తున్న ఎన్ఐఏ

ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలో గాలిస్తున్న ఎన్ఐఏ

దేశవ్యాప్తంగా మొత్తం 19 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం సోదాలు చేస్తున్నారు. ఇస్లామిక్ టెర్రర్ గ్రూపు ఐసిస్ నెట్ వర్క్ ఛేదించే క్రమంలో ఈ దాడులు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఒక్క కర్ణాటకలోనే మొత్తం 11 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తుండగా.. మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీలోనూ పలు చోట్ల దాడులు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల మహారాష్ట్రలోని 40 చోట్ల అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో ఆయుధాలు, నగదు, పలు డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు పనిచేస్తున్న 15 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఒకరు ఐసిస్ సానుభూతి పరుడని, యువతను ఐసిస్ లో చేరుస్తున్నాడని గుర్తించారు. నిందితుడిని మరింత లోతుగా విచారించి సేకరించిన సమాచారంతో అధికారులు తాజా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.