జనవరి 6వ తేదీతో ముగియనున్న ప్రజాపాలన .. ఆందోళన అవసరం లేదన్న సీఎస్
జనవరి 6వ తేదీతో ముగియనున్న ప్రజాపాలన .. ఆందోళన అవసరం లేదన్న సీఎస్
ప్రజాపాలనలో భాగంగా ఐదు గ్యారెంటీలకు... అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. ఇందులో యువ వికాసం మినహా మిగతా ఐదు గ్యారెంటీలకు ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రజాపాలన - అభయహస్తం దరఖాస్తులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. ప్రజాపాలన డిసెంబర్ 28న ప్రారంభమైందని... జనవరి 6వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని.. పొడిగించడం ఉండదని స్పష్టం చేశారు. దీంతో చాలామంది ఆందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి చెబుతూ, మరో నాలుగు నెలల తర్వాత మరోసారి ప్రజాపాలన ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి నాలుగు నెలలకు ఓసారి గ్రామాలు, పట్టణాలలో ప్రజాపాలన ప్రత్యేక సభలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.