ఇందిరా పార్క్ వద్ద నిరసన చేపట్టిన I.N.D.I.A. కూటమి
ఇందిరా పార్క్ వద్ద నిరసన చేపట్టిన I.N.D.I.A. కూటమి
పార్లమెంట్‌లో జరిగిన ఘటనపై హోంమంత్రి అమిత్ షా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద I.N.D.I.A. కూటమి చేపట్టిన ధర్నాలో మల్లు భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎంతోమంది త్యాగాల ఫలితం వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. కానీ ప్రస్తుతం దేశంలో అరాచక పాలన సాగుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందన్నారు. నియంతృత్వ పోకడలతో నరేంద్రమోదీ పాలన కొనసాగుతోందన్నారు.
దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని.. ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన ప్రతివారినీ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. పార్లమెంట్ భవనంలో దాడిపై వివరణ ఇవ్వాలని అడిగిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు. పార్లమెంటును రక్షించలేని బీజేపీ.. దేశ రక్షణను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు
నేడు దేశవ్యాప్త బంద్.. ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో పాల్గొననున్న
సీఎం రేవంత్‌రెడ్డి
పార్లమెంటు నుంచి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ‘ఇండియా’ కూటమి నేడు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నెల 13న కొందరు దుండగులు లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించి పొగబాంబు వదిలి నానా హంగామా చేశారు. బీజేపీ ఎంపీ సిఫార్సు ద్వారానే వారు లోక్‌సభలోకి రాగలిగారని, ఈ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన విపక్ష ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు.
పార్లమెంటు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి బయటకు పంపారు. కాంగ్రెస్ కూటమి దీనిని నిరసిస్తూ నేడు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతోపాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారు.