ఆరోగ్యంగా ఉంటే జీతం పెంచుతాం.. బోనస్ ఇస్తాం
ఆరోగ్యంగా ఉంటే జీతం పెంచుతాం.. బోనస్ ఇస్తాం
తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు తాము సంపాదించే లాభాల్లో వాటాగా బోనస్ ఇస్తుంటాయి చాలా కంపెనీలు. అయితే ఆ బోనస్ డబ్బు ఆ ఉద్యోగి ఒకనెల జీతం ఉండొచ్చు.. కాకపోతే రెండు నెలలు ఉండొచ్చు.. ఉద్యోగులు వారి పని తీరు ఆధారంగా బోనస్ ప్రకటిస్తారు. కాని చైనాలోని డాంగ్‌పో పేపర్‌లోని ఉద్యోగులు బోనస్ ప్రకటించే విషయంలో షాక్‌కు గురయ్యారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, డాంగ్‌పో పేపర్ కంపెనీ ఉద్యోగులకు బోనస్ ను వారి ఫిట్‌నెస్ సామర్ద్యాన్ని బట్టి ప్రకటిస్తామని చెప్పడంతో ఆ కంపెనీ ఉద్యోగులు శారీరక శ్రేయస్సుపై ఎక్కువ దృష్టి పెట్టారు.
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న డాంగ్‌పో పేపర్ కంపెనీ ఉద్యోగులకు బోనస్ ప్రకటించే విషయంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. బోనస్ ఇప్పుడు ఉద్యోగుల ఫిట్‌నెస్ స్థాయిలను బట్టి నిర్ణయిస్తామనిడాంగ్‌పో పేపర్ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. . నివేదికల ప్రకారం, ఉద్యోగులు నెలలోపు 50 కిలోమీటర్లు పరిగెత్తితేనే వారికి పూర్తి నెలవారీ బోనస్ అందుతుంది. అదనపు బోనస్‌లలో 40 కిలోమీటర్లు పరుగెత్తినందుకు 60 శాతం రివార్డ్, 30 కిలోమీటర్ల పరుగునకు 30 శాతం బోనస్ మరియు నెలలో 100 కిలోమీటర్ల పరుగు సాధించిన వారికి అదనపు 30 శాతం బోనస్ గా ఇస్తామని ప్రకటించింది.
ఈ కొత్త బోనస్ విధానం స్పీడ్ వాకింగ్..... మౌంటెన్ హైకింగ్ వంటి కార్యకలాపాలను విస్తరిస్తుందని కంపెనీ యాజమాన్యం చెబుతుంది. ఈ వాకింగ్ కు ఉద్యోగుల ఫోన్లలోని ప్రత్యేక యాప్ ద్వారా గుర్తిస్తారు. తమ కంపెనీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే తమ లక్ష్యమని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడమే కాకుండా ఆర్థిక ప్రోత్సాహం కూడా లభించడంతో ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.