అసెంబ్లీ, లోక్ సభ స్థానాల ఇన్చార్జిల రెండో జాబితా విడుదల చేసిన వైసీపీ
అసెంబ్లీ, లోక్ సభ స్థానాల ఇన్చార్జిల రెండో జాబితా విడుదల చేసిన వైసీపీ
ఇటీవల 11 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చుతూ తొలి జాబితా విడుదల చేసిన వైసీపీ అధినాయకత్వం... తాజాగా మరి కొన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాల ఇన్చార్జిల నియామకాలకు సంబంధించి రెండో జాబితా విడుదల చేసింది.
నేడు 27 మందితో విడుదలైన జాబితా చూస్తే... పలువురు ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపించినట్టు స్పష్టమవుతోంది. కాగా, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాజా ఇన్చార్జి నియామకాలు చేపట్టినట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇటీవల ఇన్చార్జిల మార్పు అంశంతో వైసీపీలో అసంతృప్తులు చెలరేగాయి. తాజా జాబితా నేపథ్యంలో, వైసీపీ నేతల స్పందనలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
నేటి రెండో జాబితా పరిశీలిస్తే... మాజీ మంత్రి శంకరనారాయణ ఈసారి అనంతపురం ఎంపీ స్థానం ఇన్చార్జిగా నియమితులయ్యారు. హిందూపురం ఎంపీ స్థానం నుంచి గోరంట్ల మాధవ్ కు బదులు ఇవాళే పార్టీలో చేరిన జె.శాంతకు అవకాశం ఇచ్చారు. అరకు ఎంపీ స్థానం (ఎస్టీ) ఇన్చార్జిగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి నియమితులయ్యారు. అరకు సిట్టింగ్ ఎంపీ గొడ్డేటి మాధవి ఈసారి అరకు ఎస్టీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.
ఎంపీ మార్గాని భరత్ రామ్ ఈసారి రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగడం ఖరారైంది. రాజమండ్రి రూరల్ ఇన్చార్జిగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు.
ముఖ్యంగా, మచిలీపట్నం బరి నుంచి ఈసారి మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తికి అవకాశం ఇస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గానికి పేర్ని కృష్ణమూర్తిని ఇన్చార్జిగా నియమించారు.